Artificial Intelligence: పదేళ్లలోపే క్యాన్సర్ అంతమా? ఏఐ కంపెనీల గాలి తీసేసిన ఫార్మా!
Artificial Intelligence: రాబోయే పదేళ్లలోపే క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు భూమ్మీద లేకుండా పోతాయా? వైద్య ప్రపంచంలో ఏఐ అద్భుతాలు సృష్టించబోతోందా? అవుననే అంటూ ప్రముఖ ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు టెక్, వైద్య వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. వేల ఏళ్లుగా మనుషులను వణికిస్తున్న మొండి వ్యాధులకు పదేళ్లలో చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ సంస్థ ఊదరగొడుతోంది. అయితే, ఏఐ కంపెనీల ఈ భారీ బిల్డప్‌పై ఔషధ తయారీ (ఫార్మా) కంపెనీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెబుతూ ఏఐ కంపెనీల గాలి తీసేస్తున్నాయి.సాధారణంగా ఒక కొత్త వ్యాధికి మందు కనిపెట్టాలంటే శాస్త్రవేత్తలకు దశాబ్దాల సమయం పడుతుంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఆ సుదీర్ఘ పరిశోధనలు కేవలం కొన్ని వారాలకే కుంచించుకుపోతాయని ఆంత్రోపిక్ అంచనా వేస్తోంది.
