తెలంగాణ

ఈ భూములు మీవేనా? ప్రూవ్ చేస్కోండి.. ఎర్రవల్లి రైతులకు నోటీసులు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క ఆదేశం ఎర్రవల్లి రైతులకు కొత్త ఇబ్బందులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అధికారులు వెంటనే సర్వే చేసి లెక్కలు తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో సర్వేలు చేస్తున్నారు. మర్కూక్ మండలం ఆఫీసులో ముందుగా రికార్డులు పరిశీలించిన అధికారులు.. భూముల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దళిత రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలో సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు నోటీసులు ఇవ్వడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ భూమి మీదే అని నిరూపించుకునేందుకు ఆధారాలు చూపాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారని దళిత రైతులు మండిపడుతున్నారు.