ఏపీ

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసు.. ఈడీ ఆకస్మిక సోదాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం తెలంగాణ, ఏపీలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్నకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.హైదరాబాద్ పరిధిలోని కాశీమ్ బౌలిలో ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. నగరంలోని పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ట్రూ గ్రేడర్ సంస్థతో పాటు అల్వాల్‌లోని వెంకటాపురంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఏపీలోని మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఆవాస రిసార్ట్‌లోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.