National

Apple Business Strategy: కస్టమర్లను పిండేస్తున్న యాపిల్.. ఐఫోన్ 18 ప్రోపై బయటపడ్డ దారుణ దోపిడీ!

Apple Business Strategy: ప్రీమియం బ్రాండ్.. స్టేటస్ సింబల్.. ఈ రెండు మాటల మాటున ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ చేస్తున్న వ్యాపార మాయాజాలం మరోసారి బట్టబయలైంది. లేటెస్ట్ ఫీచర్లు, కెమెరా క్వాలిటీ పేరుతో ఇప్పటికే లక్షల్లో ధరలు నిర్ణయిస్తున్న కంపెనీ.. ఇప్పుడు కేవలం 'స్టోరేజ్ అప్‌గ్రేడ్' పేరుతో కస్టమర్ల జేబులను ఏ విధంగా గుల్ల చేస్తోందో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో అదనపు మెమరీ కోసం అయ్యే హార్డ్‌వేర్ ఖర్చుకు, కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న ప్రీమియానికి అసలు పొంతనే లేదని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన పరిశోధనాత్మక కథనంలో కుండబద్దలు కొట్టింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక బయటపెట్టిన లెక్కలు చూస్తే యూజర్స్ నిలువునా మోసపోతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఐఫోన్ 18 ప్రోలో 256GB నుంచి 1TB స్టోరేజ్‌కు పెంచడానికి కంపెనీకి అయ్యే ఖర్చు కేవలం 192 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.18 వేలు). కానీ, అదే 1TB వేరియంట్ కావాలంటే కస్టమర్ నుంచి అదనంగా లాగుతున్న మొత్తం ఏకంగా 600 డాలర్లు (దాదాపు రూ.56 వేలు). అంటే ఒక్క 1TB అప్‌గ్రేడ్‌పైనే సుమారు రూ.38 వేలకు పైగా నికర లాభాన్ని యాపిల్ తన ఖాతాలో వేసుకుంటోంది.