ఏపీ
తిరుమల అప్డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..
శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఈ క్రమంలో ఉచిత సర్వదర్శనం కోసం విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. క్యూలైన్ వైకుంఠం కాంప్లెక్స్ దాటి, బయట ఉన్న బాట గంగమ్మ గుడి వరకు చేరుకుంది. నేడు ఉదయం 8 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే రూ. 300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా... టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని తెలిపింది.
