ఏపీ

AP Farmers: ఏపీపై విరుచుకుపడ్డ 'అర్నబ్'.. రైతన్నకు మరింత కష్టకాలం

AP Farmers: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. సరిగ్గా చేతికొచ్చే టైంకి తీరని విషాదాన్ని మిగిల్చింది. బంగాళాఖాతంలో పుట్టిన తీవ్ర తుఫాను 'అర్నబ్' ఏపీ కోస్తా జిల్లాలపై విలయతాండవం చేసింది. గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల భీకర వేగంతో యానం–అమలాపురం మధ్య తీరం దాటిన ఈ పెను తుఫాను ధాటికి అన్నదాతల బతుకులు అల్లకల్లోలమయ్యాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి ఏడు జిల్లాలు అతలాకుతలమవగా, రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టంతో పాటు ఊహించని స్థాయిలో జరిగిన ఆస్తి, పంట నష్టం రైతాంగాన్ని కోలుకోలేని స్థితిలోకి నెట్టేసింది.'అర్నబ్' తుఫాను మిగిల్చిన అత్యంత తీవ్రమైన దెబ్బ వ్యవసాయ రంగానికే తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.