క్రైమ్
Ananthagiri: బస్సు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి.. సీఎం దిగ్భ్రాంతి !
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపుతప్పి లోయవైపు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన గ్రామస్థులంతా కలిసి వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న తమ బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బస్సులో బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది.
