తెలంగాణ

కోల్ స్కామ్‌తో AMRకు లింకులు.. మహేశ్‌రెడ్డి ఆఫీసులు, నివాసాల్లో ఈడీ సోదాలు

AMR GROUP : పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన అక్రమ బొగ్గు మైనింగ్, నిధుల మళ్లింపు వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రముఖ మౌలిక వసతుల సంస్థ 'ఏఎంఆర్ గ్రూప్' మెడకు చుట్టుకుంది. దాదాపు రూ.650 కోట్ల భారీ స్కామ్, హవాలా లింకులపై గురిపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఏఎంఆర్ అధినేత ఎ.మహేశ్‌రెడ్డి లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు.హైదరాబాద్ బంజారాహిల్స్ కమలాపురి కాలనీలోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని మహేశ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ కంపనీల్లో ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక ఈడీ అధికారులు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, భారీ ఆర్థిక లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.