ప్రపంచం

డేంజర్స్ బెల్స్.. నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు

నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది. ఇదిలాఉండగా, నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. దార్చులా జిల్లా అపి హిమల్ రూరల్ ప్రాంతంలో భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.అవి చౌలానీ నది ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.