National

AI: ‘చుట్టమల్లె’ ఏఐ మార్ఫింగ్ చిచ్చు .. టాలీవుడ్‌లో సరికొత్త దుమారం!

AI: ఒకప్పుడు సినిమా తెరపై ఊహాలోకాలను ఆవిష్కరించేందుకు, విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతాలు సృష్టించేందుకు టెక్నాలజీని వాడేవారు. నేడు ‘కృత్రిమ మేధ’ రూపంలో వచ్చిన విప్లవం పరిశ్రమ రూపురేఖలనే మార్చేస్తోంది. అయితే, అదే టెక్నాలజీ ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేసేందుకు రాక్షస సాధనంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. 'దేవర' సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన అసభ్యకర ఏఐ మార్ఫింగ్ ఉదంతం.. టెక్నాలజీ దుర్వినియోగం ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టిన తాజా ఉదాహరణ మాత్రమే.ఒక వ్యక్తి ప్రవర్తన, హావభావాలు, గొంతు, శరీర కదలికలను కంప్యూటర్ అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషించి.. వారు ఎన్నడూ చేయని పనులను చేసినట్లుగా, మాట్లాడని మాటలను మాట్లాడినట్లుగా సృష్టించడమే డీప్‌ఫేక్ సాంకేతికత. గతంలో ఒక వీడియోను మార్ఫింగ్ చేయాలంటే నిపుణులైన ఎడిటర్లు, ఖరీదైన సాఫ్ట్‌వేర్ అవసరమయ్యేది. కానీ నేడు ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్, స్మార్ట్‌ఫోన్ యాప్స్ పుణ్యమా అని ఎవరైనా నిమిషాల వ్యవధిలోనే ఎవరి ముఖాన్ని, శరీరాన్నైనా మార్చేసే వీలు ఏర్పడింది. హెయిర్ మూవ్‌మెంట్స్, లైటింగ్, కంటి రెప్పల కదలికలను కూడా సహజంగా మార్చగలగడం వల్ల ఏది అసలు? ఏది ఏఐ సృష్టి? అనేది సాధారణ కంటితో గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.