తెలంగాణ

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విశ్వసనీయ సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ (GHMC) అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. నగరంలోని ఎల్‌బీనగర్‌లో ఆయన ఉంటున్న నివాసంతో పాటు సూర్యాపేటలో సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న ఆయన స్వగృహం, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపడుతున్నాయి.ఏడీ యాదగిరికి చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల గురించి విశ్వసనీయ సమాచారం రావడంతోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.