స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు
స్వీట్ షాపులో చిన్న వివాదం కాస్త చిలికిచిలికి గాలి వానలా మారింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు.. ఓ స్వీటు కొనుగోలు చేశాడు. అయితే, ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని రాజు యజమానిని నిలదీశాడు. ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురైన కస్టమర్ షట్టర్ కిందికి వేసేందుకు యత్నించాడు.దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న నలుగురు పోలీసులు రాజుపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అయితే, కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగిన రాజు.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.
