రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్
రాష్ట్రంలో ఓ వైపు పండుగ వాతావరణం కనిపిస్తుంటే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేట్ వాహనాల్లో వెళితే భద్రత ఉండదని భావించి టీజీఎస్ఆర్టీని నమ్ముకున్న ప్యాసింజర్స్ జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. మొన్నటివరకు ఉన్న సాధారణ చార్జీల కంటే ఇవాళ ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్యాసింజర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకు ‘స్పెషల్’ అని బోర్డులు పెట్టి విపరీతంగా దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ. 290 టికెట్ చార్జ్ చేయగా.. రాఖీ రోజున రూ.400 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతున్నదని, దానికి సంబంధించిన టికెట్ ఫేర్, డ్రైవర్ వాయిస్‌ను వీడియో తీసి ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
