టాప్ న్యూస్

ఉద్యోగాల కల్పన పేరిట డీడీయూజీకేవై నిధుల్లో భారీ కుంభకోణం?

గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ (DDUGKY) పథకం నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యువతకు ఉద్యోగానికి పనికొచ్చే ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వకుండానే ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసినట్టు సమాచారం. ‘సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కేంద్రంగానే కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు హైకోర్టు లేదా అత్యున్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్, ఉపాధి కల్పన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.అయితే, సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ఉపాధి శిక్షణ ఇస్తున్నది. అయితే,ఇటీవల కాలంలో ప్రాజెక్టుల పేరిట సదరు కంపెనీకి నిధులు భారీగానే అందాయి. కానీ, శిక్షణ ఎంతమందికి అందించారనే దానిపై లెక్కల్లో తేడాలు వచ్చాయి .