ఏపీ

ముంచుకొస్తున్న వాయుగుండం.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

 'అర్నబ్' తుపాను సృష్టించిన భీకర బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు ఇంకా కోలుకోకముందే, రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మరో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.