యూనిఫాంలో ఉన్న క్రిమినల్.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ సంచలన పోస్టు!
హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ నేపథ్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన చేసి పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక విశ్రాంత ఐపీఎస్.. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న మరో ఐపీఎస్ మీద నేరపూరిత ఆరోపణలు చేయడం పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్ అయ్యింది. విశ్రాంత ఐపీఎస్ నాగేశ్వర్ రావు స్పందిస్తూ.. 'యూనిఫాంలో ఉన్న నేరస్థుడు' సజ్జనార్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీపీ పోస్టు నుంచి ఆయనను బదిలీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక సహోద్యోగిని ఇలా విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సి వచ్చిందని వివరించారు.
