క్రైమ్

‘బిగ్ రివీల్’పేరిట అటెన్షన్ గ్రాబ్ .. రూ.8.5 కోట్లు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ప్రకటనలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. మరికొందరు సోషల్ మీడియాను వాడే క్రమంలో వారికి తెలియకుండానే సైబర్ దాడుల బారిన పడుతున్నారు. అయితే, బిగ్ రివీల్ పేరిట ఓ కేటుగాడు రూ. 8.5 కోట్లు దోచేశాడు. బాధితుల్లో ఒకరు సోషల్ మీడియాలో అసలు విషయం పోస్టు చేయగా.. ఈ నేరం వెలుగులోచి వచ్చింది.

కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘25 August 2026’ పేరిట ఓ కేటుగాడు ఖాతా తెరిచాడు.ఆగస్టు 25న ఓ పెద్ద రహస్యం బయటపెట్టబోతున్నానని.. కొన్ని రీల్స్ పోస్ట్ చేశాడు. తాను రివీల్ చేయబోయే సీక్రెట్ చూసి ఎవరూ పశ్చాత్తాపపడరని ప్రచారం చేశాడు. అదేంటో తెలియాలంటే.. తన టెలిగ్రామ్ ఛానల్‌లోకి రావాలంటూ ఆహ్వానించాడు. ఆ స్పెషల్ వీడియో చూసేందుకు.. ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశాడు. ఇలా 1.66 లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించడంతో రూ. 8.5 కోట్లు వచ్చినట్టు తెలిసింది. ఆగస్టు 25న ఆ వీడియో రివీల్ చేయగా అందులో ‘బిగ్ రివీల్’ లేనే లేదని, ‘సమయం ఎంతో విలువైనది’ అనే మోటివేషనల్ వీడియో మాత్రమే ప్లే అయ్యిందని సమాచారం.