International

జర్మనీతో రూ.70,000 కోట్ల ఒప్పందం.. భారత నౌకాదళంలోకి 6 అత్యాధునిక జలాంతర్గాములు!

భారత నౌకాదళాన్ని మరింత సమర్థవంతంగా, బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్-75(ఐ) కింద జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనుంది. ఈ మేరకు రూ.70,000 కోట్ల భారీ ప్రతిపాదన త్వరలోనే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ముందుకు రానుంది. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా ఈ జలాంతర్గాములను భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ఆమోద ముద్ర వేయడానికి సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారతదేశానికి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL), జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (TKMS) సంయుక్తంగా చేపట్టనున్నాయి.