ప్రతి జిల్లాలో 5జీ.. ఖాతాల్లోకి రూ.50 లక్షల కోట్లు : ప్రధాని మోడీ
దేశంలోని ప్రతిజిల్లాలో 5జీ సేవలు విస్తరించాయని, ఫలితంగా మొబైల్ ద్వారానే అన్నిరకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇంటర్నెట్ వేగం టెలికాం రంగం, మొబైల్ ఫోన్స్, నెట్వర్క్, స్పెక్ట్రమ్లకే పరిమితం కాలేదని.. సుపరిపాలనకు, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించే అత్యంత కీలక సాధనంగా మారిందన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో గురువారం ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్లో మోడీ ప్రసంగించారు. ఇంటర్నెట్ వినియోగంతో వందలాది ప్రభుత్వ సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వ సాయం లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు అనుసంధానించిన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ జరుగుతోందన్నారు. దీంతో డిజిటల్ అనుసంధానిత విద్యకు మరింత ఊతం లభించిందని తెలిపారు. అయితే, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని అభిప్రాయపడ్డారు.
