బ్లాక్ లిస్టులో 2500 ఎకరాల భూమి.. ఫార్మా సిటీ రైతుల ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు డిమాండ్లు వినాలని గత కొన్నిరోజులు ఫార్మాసిటీ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిరంతరాయంగా న్యాయ పోరాటం చేస్తున్న రైతులు..ఇవాళ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫార్మాసిటీ బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నప్పటికీ పోలీసుల బలగాల సాయంతో బలవంతంగా రేవంత్ సర్కార్ భూసేకరణ పూర్తి చేసింది. అయితే, తమకు చెందిన 2500 ఎకరాల పట్టా భూమిని సైతం ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని రైతులు ఆందోళనకు దిగారు. ఒప్పందం ప్రకారం తీసుకున్న భూమి కాకుండా తమకు చెందిన పట్టా భూములను ఎలా బ్లాక్ లిస్టులో పెడతారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
