తెలంగాణ
బిల్లులపై 25 శాతం కమీషన్.. ఏసీబీకి చిక్కిన అధికారులు
భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పీఎంకేఎస్‌వై అధికారులు సతీశ్ రెడ్డి, రాజు ఏసీబీకి చిక్కారు. వారు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసేందుకు 25 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. మొత్తంగా రూ.1.62 కోట్ల పనుల బిల్లుల వ్యవహారంలో లంచం డిమాండ్ చేయగా.. కాంట్రాక్టర్ నుంచి రూ.39 లక్షలు అడిగారు. అయితే, బాధిత కాంట్రాక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆన్‌లైన్‌లో నిందితుల ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. తాజాగా మరో రూ.1.34 లక్షల బిల్లులోనూ అవినీతి అధికారులు కమీషన్ డిమాండ్ చేశారు. వారి తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పీఎంకేఎస్‌వై కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
