తెలంగాణలో 235.. ఏపీలో 388 కరువు మండలాలు
ఎన్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కరువుపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ వానాకాలంలో దాదాపు 17శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రకటించారు. దీంతో దాదాపు 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావపరిస్థితుల కారణంగా ఏపీలోనూ తీవ్ర కరువు ఏర్పడినట్టు సమాచారం. రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో మొత్తం 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా, మరో 105 మండలాలను మధ్యస్త కరువు మండలాలుగా వర్గీకరించింది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ)జి.సాయిప్రసాద్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వులు విడుదల చేశారు.
