తెలంగాణ

22A Lands: ధరణి ఖర్చులు రూ.1,350 కోట్లకు ఎలా పెరిగింది : సీఎం రేవంత్

22A Lands : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న 22A నిషేధిత భూముల వ్యవహారంపై శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో తెరవెనుక సాగిన భారీ భూ దందాలను, ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను ఎండగడుతూ అధికార పక్షం తరఫున గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా భూములు 22A (నిషేధిత జాబితా)లో ఉండటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. అసలు ఆ కోటి ఎకరాల లెక్క ఏంటో అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు. "ఆ కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే ఉండాలి.. అందులోంచి ఒక్క ఇంచు భూమిని కూడా తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు" అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కోటి 2 లక్షల ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ కోటి ఎకరాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఆ జాబితాలోకి వెళ్లాయని సీఎం సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భూములకు సంబంధించిన అధికారిక లెక్కలను వెల్లడించారు.