తెలంగాణ

22A : 22ఏ సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణలో భూములు, ప్లాట్ల కొనుగోలుదారులను ఏళ్ల తరబడి వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన సమస్య 'సెక్షన్ 22-ఏ'. నిషేధిత భూముల జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు కాక, ఉన్న ఆస్తులను అమ్ముకోలేక లక్షలాది మంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా సీఎం చేసిన ప్రకటనను అమలు చేస్తూ, 22-ఏ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించింది. ఈ మేరకు శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు.నిషేధిత ఆస్తుల జాబితాపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం జీ.ఓ.ఆర్.టి నెం. 564ను జారీ చేసింది. సీసీఎల్‌ఏ (CCLA) డి.ఎస్.లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ త్రిసభ్య కమిటీలో.. న్యాయశాఖ కార్యదర్శి పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. నిషేధిత జాబితాలోని అడ్డంకులను తొలగించి, అర్హులైన బాధితులకు త్వరితగతిన ఊరట కల్పించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.