తెలంగాణ

2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం కూడా లేదు : మంత్రి పొంగులేటి

ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు? ఎన్ని వేల ఎకరాలు వెనకేసుకున్నారు? అనే అంశం మీద ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ‘ధరణి’ మాటున వందల ఎకరాల భూదోపిడీకి పాల్పడిందని ఆరోపించగా.. ఆ వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు సైతం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఎంత భూమి ఉంది? ఇప్పుడు ఎంత ఉందో లెక్కలు చెప్పారు. ఇవాళ ఉదయం కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌ ఆధారంగా ‘కల్వకుంట్ల ముఠా’ అడ్డంగా దొరికిపోయిందని.. సున్నా ఎకరాల నుండి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి పొంగులేటి విమర్శించారు. 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్క ఎకరం కూడా భూమి లేదని తెలిపిన కేసీఆర్‍కు.. ఇప్పుడు రూ.వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.