మై హోంకు శంషాబాద్లో 2వేల ఎకరాలు.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు(My Home)
My Home Group: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి ముసుగులో సాగిన అక్రమ భూ బాగోతాలను సర్వే నంబర్లతో సహా బట్టబయలు చేస్తూ అసెంబ్లీని నివ్వెరపరిచారు. "కేసీఆర్ హోమే మైహోం.. ఆ సంస్థ ఎవరి బినామీనో ఈ రాష్ట్రంలో తెలియనివారు ఎవరైనా ఉన్నారా?" అంటూ నేరుగా కేసీఆర్ను టార్గెట్ చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఒకే సంస్థ చేతుల్లోకి ఏకంగా వేల ఎకరాలు ఎలా వెళ్లాయో వివరిస్తూ, ఇది సుమారు లక్ష కోట్ల భారీ భూ కుంభకోణమని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తక్షణమే ప్రత్యేక సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.శంషాబాద్ ప్రాంతంలో సాగిన భూ ఆక్రమణల లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ పరిధిలోని 5 ప్రధాన గ్రామాల్లో పేదలు, అసైన్డ్ రైతుల భూములను మైహోం సంస్థ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు.
ఎయిర్పోర్టుకు ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2,463 ఎకరాల భూమిని ఒక్క సంస్థకే ఎలా కట్టబెడతారని విమర్శించారు. చట్టాల కళ్లుగప్పి, సీలింగ్ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి ఈ మొత్తం భూములను 28 డొల్ల కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఆధారాలతో సహా సీఎం వివరించారు.
