12 మంది అదనపు జడ్జిలు పర్మినెంట్..కొలీజియం గ్రీన్‌సిగ్నల్!
దేశంలోని వివిధ కోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి సుప్రీంకోర్టు కొలీజియం శుభవార్త చెప్పింది. ఇంతకాలం అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారికి పర్మినెంట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు వీరు విధులు నిర్వహిస్తున్న చోటనే శాశ్వత జడ్జిలుగా తీర్పులు చెప్పనున్నారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కోసం న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు, కొత్త వారి నియామకానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు ప్రధాన హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. బుధవారం సమావేశమైన కొలీజియం.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, గువాహటి న్యాయస్థానాలకు సంబంధించిన ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఏపీ హైకోర్టుకు చెందిన ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
