తెలంగాణ

Tummidihatti Barrage: మేడిగడ్డ గండం దాటి.. తుమ్మిడిహెట్టి వైపు రేవంత్ జల వ్యూహం!

Tummidihatti Barrage: తెలంగాణను ఏళ్ల తరబడి వేధించిన కాళేశ్వరం వివాదం, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తెచ్చిన రాజకీయ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త జల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. మేడిగడ్డ వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, దానికి తిరుగులేని శాశ్వత సాంకేతిక సమాధానం చూపించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాత మూలాల వైపు అడుగులు వేస్తోంది. దివంగత వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అసలు గుండెకాయ అయిన ‘తుమ్మిడిహెట్టి’ని మళ్లీ వెలుగులోకి తెచ్చి, ఉత్తర తెలంగాణకు జీవనాడిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ముంబై వేదికగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అత్యంత కీలక భేటీకి సిద్ధమయ్యారు.