Spirituality
Spirituality: సుందరకాండ పారాయణం ఎందుకు చేస్తారు?.. సంప్రదాయంలో ఉన్న విశిష్టత ఇదే!..
మనిషి జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా.. ధర్మాన్ని, భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని బోధించే మహత్తర ఆధ్యాత్మిక గాథే సుందరకాండ. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలోని ఏడు కాండల్లో సుందరకాండకు విశిష్టమైన స్థానం ఉంది. ఇందులో శ్రీరాముడి కార్యాన్ని తన ప్రాణకర్తవ్యంగా స్వీకరించిన ఆంజనేయుడి పరాక్రమం, బుద్ధి, ధైర్యం, వినయం, అచంచలమైన భక్తి దర్శనమిస్తాయి.
సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతుడు.. సీతాదేవిని అన్వేషించి, అశోకవనంలో ఆమెను దర్శించి, శ్రీరాముడి సందేశాన్ని అందిస్తాడు. ఈ ఘట్టాలన్నీ భక్తికి, సేవకు, ధర్మనిష్ఠకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. అందుకే సుందరకాండ పారాయణం అంటే కేవలం శ్లోకాలను చదవడం మాత్రమే కాదు.. హనుమంతుడి భక్తి మార్గాన్ని మనసులో ఆవిష్కరించుకోవడం.
