గణపతి పూజలో పెట్టిన కొబ్బరికాయను నిమజ్జనం తర్వాత ఏం చేస్తే మంచిది?..
గణేష్ ఉత్సవాల్లో గణపతి ప్రతిష్ఠతో పాటు కలశ స్థాపనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కలశంపై ఉంచే కొబ్బరికాయను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కూడా ఈ కొబ్బరికాయను సాధారణ వస్తువులా కాకుండా భక్తి, గౌరవంతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గణపతి నిమజ్జనం తర్వాత కలశంలో ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. కాగా గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత కలశంలో కొబ్బరికాయ పాడవకుండా, తినడానికి అనువుగా ఉంటే దానిని పగలగొట్టి ప్రసాదంగా కుటుంబ సభ్యులు, బంధువులు లేదా భక్తులకు పంచుకోవచ్చు.. లేదా కొబ్బరికాయను వెంటనే ఉపయోగించలేని పరిస్థితిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచి, తర్వాత దేవాలయంలో సమర్పించవచ్చు. కొబ్బరికాయకు మొలక వచ్చినట్లయితే దానిని ఇంటి తోటలో లేదా అనుకూలమైన ప్రదేశంలో నాటడం కూడా మంచిదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి.
