Spirituality

Spirituality: పితృపక్షాల వెనుక ఉన్న సనాతన సందేశం ఇదే!..

ఒక తరం వెళ్లిపోతుంది.. మరో తరం ఈ భూమిపైకి వస్తుంది. కానీ తరాలు మారినా చెదరిపోని ఒక బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అదే పూర్వీకుల జ్ఞాపకం.. అదే వంశ మూలాలతో మనిషికి ఉన్న అనుబంధం. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి భారతీయ సంస్కృతి ప్రత్యేకంగా కేటాయించిన పవిత్ర కాలమే పితృపక్షం.. మహాలయ పక్షం.మనిషి తన పుట్టిన రోజును గుర్తు చేసుకుంటాడు.. వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటాడు.. పండుగలను వైభవంగా నిర్వహిస్తాడు. కానీ తనకు ముందు తరాల పూర్వీకులను స్మరించుకోవడానికి కూడా ఒక ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేసుకున్న సంస్కృతి మన భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అందుకే పితృపక్షం అంటే కేవలం మరణించిన వారిని తలచుకునే కాలం కాదు.. మన ఉనికికి మూలమైన వంశాన్ని, మనకు జీవితం అందించిన తరాలను స్మరించుకునే ఆధ్యాత్మిక పర్వంగా చెబుతారు.