నా గురించి మాట్లాడిన వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి- కొండా సురేఖ

తాను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు అంతా వివరించానన్న కొండా సురేఖ.. పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది తనకు తెలియదన్నారు.

ఏఐసీసీ మెంబర్ అయిన తనకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే తప్పు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధమే లేదన్నారు. తన కూతురు సుస్మిత ఇండిపెండెంట్ అని, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం అని కొండా సురేఖ మరోసారి తేల్చి చెప్పారు. తన కూతురు రాజకీయ జీవితం తన ఇష్టమన్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండించటం కానీ సమర్థించటం కానీ చేయనని చెప్పారు.

నాకు వ్యతిరేకంగా పార్టీలోని కొంతమందితో బలవంతంగా మాట్లాడించారని కొండా సురేఖ ఆరోపించారు. అలా మాట్లాడించిన వారు ఎవరో కూడా తనకు తెలుసున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.