సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Konda Surekha: ఇప్పటికే కూతురి వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ.. తగ్గేదేలేదు అంటున్నారు. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారామె. ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు.
ఎవరిని అడిగి ముఖ్యమంత్రి రేవంత్ ఎమ్మెల్యే టికెట్లు ప్రకటిస్తున్నారు? అని కొండా సురేఖ నిలదీశారు. పదేళ్ల పాటు నేనే సీఎం అని రేవంత్ చెప్పుకోవడం వల్ల మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఇక, రాజీనామా చేయాలని తనతో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. బీసీనైన నాకొక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అని సురేఖ ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.
