వరుణ యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
Varuna Yagam: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పూర్ణాహుతి సామాగ్రిని హోమగుండంలో సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలశయాలు నిండి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ తీరంలో అత్యంత వైభవంగా ఈ వరుణయాగాన్ని చేపట్టింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని విజయ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజలతో ఈ మహా క్రతువు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా వానలు కురవాలని మంత్రి ఉత్తమ్ దంపతులు యాగాన్ని ప్రారంభించగా.. పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు.
