రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ఎస్టీవో ఉద్యోగి
ACB Raids: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఓ రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ పెన్షన్ ఫైల్ నిమిత్తం లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.
బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ట్రెజరీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అని చెప్పారు.
