కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరిగింది.
''రెవెన్యూ శాఖకు, కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వండి. ఆయన కొనుగోలు చేసింది ఎంత? అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది? 30 రోజుల వ్యవధిలో ఇది తేల్చాలి? రెవెన్యూ శాఖ మంత్రికి, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా'' అని సీఎం రేవంత్ అన్నారు.
కేసీఆర్ 700 ఎకరాల ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పై 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ హెచ్చరించారు. క్షమించే సమస్యే లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిని అని చెప్పుకునే కేసీఆర్ వేల కోట్లు రూపాయల విలువ చేసే వందల ఎకరాలు ఎలా సంపాదించారు అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మొత్తం 9 జిల్లాల్లో 439.30 ఎకరాలు కేసీఆర్ కుటుంబసభ్యుల పేరుపై ఉందన్నారు. కేసీఆర్ కి నోటీసులిచ్చి ఆ 388 ఎకరాల భూములను 800 దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచుతానని అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్.
