సమస్యల సుడిగుండంలో ‘సచివాలయం’.. దద్దరిల్లుతున్న నిరసనలు!
తెలంగాణ సచివాలయం సమస్యలకు నిలయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అధికారులు ఇక్కడి నుంచే అమలు చేస్తుంటారు.మంత్రులతో పాటు సీఎస్ సంజయ్ జాజు సైతం ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సంస్థలకు బిల్లుల విడుదల, ఆర్థిక పరమైన అంశాలు సచివాలయం కేంద్రంగా నడుస్తుంటాయి. సచివాలయంలో నిత్యం బిల్లుల పెండింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు వారాల కిందట తమకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్ దారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.తాజాగా సుమారు రూ.50 కోట్ల మేర వాటర్ బిల్లులు పెండింగ్ పెట్టారని సచివాలయంలో తాగునీటి సరఫరా నిలిపివేసినట్టు తెలిసింది. గతంలో ఫుడ్ బిల్లులు పెండింగ్ పెట్టారని.. భోజనం, స్నాక్స్ సైతం కాంట్రాక్టర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంటర్నెట్ బిల్లులు పెండింగ్ పెట్టడంతో ‘నెట్’ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
