గిగ్ వర్కర్లు దేశానికి పునాదులు.. సామాజిక భద్రత, రక్షణ కల్పిస్తాం
Gig Workers: 21వ శతాబ్దం డేటా శతాబ్దం అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డేటాపైనే చర్చ సాగుతోందని.. డేటా సెంటర్లు నిర్మిస్తున్నారని తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్ వంటి కంపెనీలు డేటా ఆధారంగానే నడుస్తున్నాయన్నారు. కానీ భారత దేశంలో గిగ్ వర్కర్లకు వారి డేటా నేటికీ అందుబాటులో లేదని విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన చట్టంతో డేటాపై హక్కు
గిగ్ వర్కర్ తన డేటాను తానే చూసుకోలేడన్నారు. వారు ఏం పని చేశారు, ఎన్ని డెలివరీలు చేశారు, ఎంత సమయం పట్టింది, ఎంత డబ్బు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఈ సమాచారం వారికి అందేది కాదన్నారు. కష్టం వారిదే, కానీ వారి డేటాను వారే చూసుకోలేకపోయేవారని అన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన చట్టం డేటాపై వారికి హక్కును కల్పించబోతోందని తెలిపారు. వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారో పూర్తి సమాచారం వారి చేతిలో ఉంటుందని వెల్లడించారు.
