TG : పీకల దాకా తాగి యాక్సిడెంట్ చేసిన పోలీసులు..!
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు పీకల దాకా మద్యం సేవించి కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని ఢీకొట్టినట్టు తెలిసింది.ఈ ప్రమాదంలో ట్రాలీతో పాటు కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాలీలో కూడా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
