క్రైమ్

షాద్‌నగర్‌లో కృష్ణజింక మాంసం కలకలం.. 9మంది అరెస్ట్

Deer Meat: కృష్ణ జింకను వేటాడి చంపి, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్‌డ్‌ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు కార్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

మరికల్‌ అటవీ ప్రాంతంలో జింక వేట

సెప్టెంబర్‌ 26న అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు కార్లలో నారాయణపేట జిల్లా మరికల్‌ అటవీ ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్‌ 27న ఉదయం లైసెన్స్‌డ్‌ తుపాకీతో కృష్ణజింకను వేటాడి చంపారు. అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా నరికి ప్యాక్‌ చేసుకుని హైదరాబాద్‌ వైపు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా నిందితుల ముఠా పట్టుబడింది. విచారణలో కృష్ణజింకను తామే వేటాడినట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.