Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!
వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగే క్షణంలో ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. హీరో ఇచ్చిన పవర్ఫుల్ వార్నింగ్ లేదా ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసి, సెకండ్ హాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయడానికే డైరెక్టర్ ఈ బ్రేక్‌ను ప్లాన్ చేశారని చాలా నమ్ముతారు. నిజానికి ఈ సినిమా ‘ఇంటర్వెల్ బ్యాంగ్’ అనేది డైరెక్టర్ల ఆలోచనల నుంచో, కథలోని సస్పెన్స్ కోసమో పుట్టనేలేదని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి తెర వెనుక నడిచిన సాంకేతిక అవస్థలను కప్పిపుచ్చుకోవడానికి మొదలైన ఒక విధిలేని సర్దుబాటే ఈ ‘ఇంటర్వెల్’.ఒకప్పుడు ఇప్పటిలాగా శాటిలైట్ ఫీడ్లు, డిజిటల్ ప్రొజెక్షన్లు, క్యూబ్ టెక్నాలజీలు లేవు. భారీ ఫిలిం రీళ్లను ప్రొజెక్టర్లలో తిప్పుతూ సినిమాను నడిపించేవారు. కొన్ని టెంట్ హాల్స్‌లో ఒకే ప్రొజెక్టర్ ఉండటం వల్ల ఒక రీల్ పూర్తయ్యాక రెండోది ఎక్కించడానికి తప్పనిసరిగా సమయం పట్టేది. పెద్ద థియేటర్లలో డ్యూయల్ ప్రొజెక్టర్లు ఉన్నప్పటికీ, అప్పట్లో సినిమాలు దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల సుదీర్ఘ నిడివితో ఉండేవి. అంతసేపు ప్రొజెక్టర్‌ను నిరంతరాయంగా నడపడం, భారీ రీళ్ల మార్పిడిని సమన్వయం చేసుకోవడం థియేటర్ ఆపరేటర్లకు పెద్ద సవాలుగా మారేది. ఆ రీల్ మార్పిడి వ్యవధిలో తెర చీకటిగా మారితే ప్రేక్షకులు అసహనానికి గురవుతారని, దానికి ‘ఇంటర్వెల్’ అనే ముసుగు వేసి 10 నుంచి 15 నిమిషాల విరామం ఇవ్వడం స్టార్ట్ చేశారు.
