తెలంగాణ
మూడు దశల్లో సమగ్ర భూసర్వే- మంత్రి పొంగులేటి
Land Resurvey: రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని పేర్కొన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
