తెలంగాణ

లాల్‌దర్వాజా బోనాల జాతర.. పోటెత్తిన భక్తజనం.. స్టార్ హీరో సందడి!

చారిత్రాత్మక హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ భక్తి భావనకూ, సాంస్కృతిక వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ జాతరతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజామున 4:30 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, దివ్యాభిషేకాలు నిర్వహించి, మొదటి బోనాన్ని సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి కృపాకటాక్షాల కోసం ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, తలపై నెయ్యి దీపాలు, వేప మండలతో అలంకరించిన బోనాలను ఎత్తుకుని నిష్ఠతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారికి నైవేద్యాలు, ఒడిబియ్యం, చీర-సారె సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.