National

Kedarnath: పుణ్యక్షేత్రాన్ని కాస్తా చెత్తకుప్పగా మార్చారు.. 5 నెలల్లోనే 135 శాతం పెరిగిన వ్యర్థాలు!

Kedarnath: సముద్ర మట్టానికి దాదాపు 3,583 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఇప్పుడు తీవ్ర పర్యావరణ విలయంలో చిక్కుకుంది. పాండవుల కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యభూమికి ఏటా లక్షలాది మంది భక్తులు మోక్షం కోసం తరలివస్తుంటారు. అయితే, భక్తి ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి కాలుష్యం హిమాలయాల ఉనికికే ముప్పు తెచ్చిపెడుతోంది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే కేదార్‌నాథ్ కొండలు చెత్త దిబ్బలుగా మారిన భయానక వాస్తవం సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా బట్టబయలైంది.కేదార్‌నాథ్ నగర పంచాయతీ వెల్లడించిన అధికారిక గణాంకాలు పర్యావరణ ప్రేమికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల కాలంలోనే ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. గత మూడేళ్ల వ్యర్థాల లెక్కలతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది.