Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం.. రూ.15లక్షల విలువైన ప్రభుత్వ మందులు రోడ్డుపాలు
Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు చేరాల్సిన మందులు రోడ్డు పాలయ్యాయి. గడువు ఉన్న మెడిసిన్‌ను ఓ మినీ డీసీఎం వ్యానులో తరలించి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్స్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఈ ఘటన జరిగింది.
సుమారు 15 లక్షల విలువైన ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన మెడిసిన్స్‌ను ఇలా రోడ్డు పక్కన పారబోయడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అక్కడికి చేరుకున్నారు. డీసీఎంలో ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మెడిసిన్స్ పారబోసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
