Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు..
Hyderabad Metro Rail: రోజూ లక్షలాది మంది ప్రజలను తమ గమ్య స్థానాలకు చేరవేసే హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. హైదరాబాద్ మెట్రో ప్రాణదాతగా మారింది. సకాలంలో అవయవాలు చేరేలా చేసి ఓ రోగి ప్రాణాలను నిలిపింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం మెట్రో రైలును వాడారు అధికారులు. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్కు సజీవ అవయవాలు గుండె, ఊపిరితిత్తులను మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించారు. భారీగా ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో మెట్రో కారణంగా.. 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకున్నారు. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి మాత్రం హైదరాబాద్ మెట్రోను వాడారు అధికారులు. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ లోని ఆసుపత్రికి అవయవాలను తరలించాల్సి ఉండగా రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ల బృందం మెట్రో అధికారుల సహకారం కోరింది. వారు వెంటనే స్పందించి ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
