తెలంగాణ

హైదరాబాద్‌లో ఓటర్లను భయపెడుతున్న ఫారమ్-7..

ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతుండగా.. ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోను కలిసి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఓట్ల తొలగింపు ఆగడం లేదని, చిన్నచిన్నకారణాలు చూపుతూ తొలగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా నోటీసులు అందుకున్న వారు సమాధానం ఇవ్వాల్సి ఉండగా, కొందరు ఇవ్వకపోవడంతో ఓట్లు డిలీట్ అవుతున్నాయని బీఎల్‌వోలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఓటర్లకు తెలియకుండానే ఫారం-7 దరఖాస్తులు వెలుగుచూడటంతో ఆందోళన నెలకొంది. ఒక బీఎల్‌ఓ కుటుంబానికి చెందిన 30 ఓట్ల తొలగింపునకు ప్రయత్నించారని.. ఈ ఘటన ముషీరాబాద్‌లో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.