తెలంగాణ

ఫారమ్-7 ఇస్తే ఓటు తొలగించనట్టు కాదు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో చివరిదశలో ఉన్నది. అయితే, కేంద్రం ఆదేశాలతో ఎన్నికల సంఘం అర్హుల ఓట్లు కూడా డిలీట్ చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. ఇటీవలికాలంలో జరిగిన ఎన్నికలు అన్నీ చట్టవిరుద్ధమేనని, లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.ఆదివారం బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాటలు ప్రజాస్వామ్యాన్ని, భారతీయ ఓటర్లను అవమానించడమేనని అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారని, అభ్యంతరం ఉన్న ఓటర్ల విషయంలో ఫారమ్ -7 సమర్పిస్తే ఈసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుందన్నారు. ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదని చెప్పారు. ఫారమ్-7ను బీజేపీ బీఎల్ఏలు ఎవరూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.