తెలంగాణ

రేవంత్ రెడ్డి.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధితా జాబితా అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా మరోసారి స్పందించారు. కమీషన్ల కోసమే పట్టా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో పెడతారా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం రైతుల భూములను కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల వ్యవసాయ భూములతో పాటు, ఇతర మూడు లేఅవుట్లలోని భూములు, బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.22Aలో చేర్చడం వల్ల వారికి రైతుబంధు, రైతుబీమా లేదని, బ్యాంకు రుణాలు లేవని, యూరియా కూడా అందడం లేదన్నారు.