తెలంగాణ

ముంచుకొస్తున్న ‘విపత్తు’.. అన్నదాత గోడు సర్కారుకు పట్టదా?

తెలంగాణలో వానలు తగ్గాయి. పంటలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో గతంతో పోలిస్తే నీటి నిల్వలు తగ్గాయి. భూగర్భజలాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే భయంకరమైన కరువు తప్పదా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అయితే, కరువు వచ్చాక స్పందించడమేనా? లేక కరువు రాకముందే రైతును కాపాడే చర్యలు మొదలవ్వాలా? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న కీలక ప్రశ్న. వర్షం తగ్గితే పంట దెబ్బతింటుంది. రైతుకు కావాల్సింది కేవలం ఒక ప్రకటన కాదు. భరోసా. పంట నష్టపోతే పరిహారం వస్తుందనే నమ్మకం కావాలి. రబీకి నీరు ఉంటుందనే నమ్మకం కావాలి. తర్వాతి పంటకు పెట్టుబడి దొరుకుతుందనే నమ్మకం కావాలి. తక్కువ నీటితో పంట వేసినా మార్కెట్ ఉంటుందనే నమ్మకం కావాలి. అన్నింటికంటే తాను ఒంటరిగా లేననే నమ్మకం రైతుకు కలగాలి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు..? ప్రభుత్వమే. అవును ప్రభుత్వం మాత్రమే.